కరీంనగర్: చరిత్ర గురించి నీతులు చెప్పే సునీల్ రావు కాంగ్రెస్ లో గోతులు తవ్వి పైకి వచ్చారని.. తన గత చరిత్రను తవ్వితీస్తే కరీంనగర్ లో తిరగలేవని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ళపు రమేష్ హెచ్చరించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుగ్గిళ్ళపు రమేష్ మాట్లాడుతూ యాదగిరి సునీల్ రావు సెలెక్టెడ్ అజ్ఞాని అని .. ఎలెక్టెడ్ మేయర్ మాదిరిగా మాట్లాడడం లేదని, నామిని ఎవరో, బినామీ ఎవరో కరీంనగర్ నగర ప్రజలకు బాగా తెలుసని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని, నోటికొచ్చినట్లు మాట్లాడితే తిరిగి అదే స్థాయిలో ప్రతిఘటనలు తప్పవని ఆయన హెచ్చరించారు. సునీల్ రావు ప్యారాచూట్ లీడర్ కాకుంటే తెలంగాణ ఉద్యమంలో అతడి పాత్ర ఏ మేరకు ఉందో శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను తెగ పొగుడుతున్న సునీల్ రావు తిరిగి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ లో చేరుతారా ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
రాజకీయ అవగాహన రాహిత్యంతో పసలేని ఆరోపణలు చేసి చరిత్రలో సునీల్ రావు స్క్రాప్ గా రుజువయ్యాడని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ పై పర్సనల్గా విమర్శలు చేసి నవ్వుల పాలయ్యాడని దుయ్యబట్టారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం సుమారు 8వేల కోట్ల అభివృద్ధి పనులను తీసుకొచ్చిన ఘనత ఎంపీ బండి సంజయ్ కుమార్ కే దక్కుతుందన్నారు. సునీల్ రావు వినోద్ కుమార్ కు బినామీ కాకుంటే ఎందుకు అంత ఉలికి పాటుతో ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి పస లేని విమర్శలు చేశారని అన్నారు. సునీల్ రావు కేరాఫ్ కాంగ్రెస్ అని ఎప్పటికీ బిఆర్ఎస్ కాలేడని విమర్శించారు. అందుకే అదే స్థాయిలో కాంగ్రెస్ లో ఎంతో కష్టపడ్డానని చెప్పడం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని సంకేతాలు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రెస్ మీట్ లో ఆనంద్, ప్రవీణ్, లోకేశ్ పాల్గొన్నారు.