కొత్త ఏడాదికి ముందు సరికొత్త మొబైల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? పాత ఆండ్రాయిన్ ఫోన్ అమ్మేసి అప్‌గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారా? ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లో ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయడానికి ముందు మీరు కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. మీ పాత ఫోన్‌ను ఇతరలకు అమ్మడానికి ముందు లేదా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఇచ్చే ముందు మీ పాత మొబైల్‌లో ఉండే డేటాను కొత్త మొబైల్‌కు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. లేదంటే మీ డేటా వారు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన యాప్స్, డేటా, మీ పాత ఫోన్లో లేకుండా చూసుకోవాలి. పైన చెప్పిన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత మీ పాత ఫోన్‌ను ధైర్యంగా మీ ఫ్రెండ్స్‌కి లేదా కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదా అమ్మడం వంటివి చేయొచ్చు. ఆన్‌లైన్ ద్వారా అమ్మాలనుకుంటే 2-gud, OLX, quickr వంటి యాప్స్‌ను వాడుకోవచ్చు. అయితే మీ పాత ఫోన్ అమ్మడానికి ముందు ఒరిజినల్ బాక్స్, దాని యాక్సెసరీస్, అన్నీ సిద్ధంగా ఉంచుకుని అమ్మకానికి పెట్టొచ్చు. మీ పాత ఫోన్లో ఉండే ముఖ్యమైన ఫోటోలు, వీడియోలను బ్యాకప్ చేసుకోవాలి. వీటితో డాక్యుమెంట్స్, ఇతర డేటాను గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ వంటి క్లౌడ్ ఆధారిత సేవలకు ఉపయోగించుకోవచ్చు. మీ ఫోటోలు, వీడియోలను పీసీ లేదా ఎక్స్ టర్నల్ హార్డ్‌డ్రైవ్‌కు ట్రాన్స్ ఫర్ చేసుకోవాలి. మీ ఫోన్లో ఉండే ఫైనాన్స్, UPI యాప్స్‌ను కచ్చితంగా డిలీట్ చేయండి. ఒకటికి రెండు సార్లు వీటికి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ యాప్స్ ఫోన్ నంబర్లకు లింక్ అవుతాయి. ఓటీపీ రాదు. కానీ అందులో ఏదైనా మీకు సంబంధించిన ముఖ్యమైన డేటా ఇతరుల చేతిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. అందుకే మీ ఫోన్ నుంచి అన్ని UPI యాప్స్ డిలీట్ చేయండి. చాలా మంది పాత ఫోన్లలో చాట్ హిస్టరీని బ్యాకప్ చేయడాన్ని మరచిపోతుంటారు. ఒకవేళ మీరు వాట్సాప్ వాడుతుంటే, ఆ యాప్ ఓపెన్ చేసి సెట్టింగులలో బ్యాకప్‌ను క్రియేట్ చేసి, దాన్ని గూగుల్ డ్రైవ్‌లోకి అప్‌లోడ్ అయ్యేలా చూసుకోవాలి. లేదంటే మీ పాత ఫోన్లో ఉన్న చాట్ హిస్టరీని కొత్త ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేయలేరు.