- అధికారుల ముమ్మర సమీక్షలు
- ఈ నెల 28 నుంచి జనవరి ఆరో తేది వరకు
ఈ నెల 28 నుంచి జనవరి ఆరో తేది వరకు నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమానికి సంబంధించి కసరత్తులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం మీటింగ్ పెట్టి వివరించారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు అధికారులకు వీటి నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా జిల్లాలకు ఇన్ ఛార్జీ మంత్రులు ఇప్పటికే కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంచుకోవాలనే సీఎం ఆదేశాల మేరకు అధికారులు సైతం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అధికారులు.. గ్రామస్థాయిలో ఉన్న లీడర్లు సమన్వయం చేసుకుని ఎలా ముందుకుసాగాలో ప్రయత్నాలు చేస్తున్నారు.
గ్రామాల్లో ఇప్పటి వరకు ఎక్కువ శాతం బీఆర్ఎస్ సర్పంచులే ఉన్నారు. వీరు అధికారంలో ఉన్న తమ కార్యకర్తలకు మేలు చేకూరేలా ప్లాన్లు సైతం వేస్తున్నారనే గుసగుసలు వినిస్తున్నాయి. ఫీల్డ్ లో వచ్చే సమస్యలపై ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. గ్రామాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఎలాంటి ఆవాంతరాలు రాకుండా అధికారులు సమీక్షలు చేస్తున్నారు. గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, ఫస్ట్ ఎయిడ్ వంటి సౌకర్యాలను అక్కడ కల్పించాలని జిల్లా కలెక్టర్లు కింది స్థాయి ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.