అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు.
‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు.
తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే.