సాయుధ మూకల అరాచక దాడులతో వణికిపోతున్న నైజీరియాలో మరో దారుణం వెలుగుచూసింది. మధ్య నైజీరియాలోని పలు గ్రామాల ప్రజలే లక్ష్యంగా ‘బండిట్స్’గా పిలిచే సాయుధ సమూహాలు అరాచక దాడులకు తెగబడ్డాయి. కాల్పులతో నరమేధాన్ని సృష్టించాయి. వరుస కాల్పుల్లో 160 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోయినట్టుగా మొదట వార్తలు వచ్చాయి. అయితే సోమవారం కూడా ఈ కాల్పులు కొనసాగడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. దాడుల్లో గాయపడిన దాదాపు 300 మందికి పైగా బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని స్థానిక అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంచితే కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా సాయుధ మూకలు మారణకాండకు పాల్పడ్డాయని, ఇళ్లలోకి చొరబడి ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా మధ్య నైజీరియా కొన్నేళ్లుగా ఈ తరహా దాడులతో వణికిపోతోంది. సామాజిక పరమైన, మతపరమైన విబేధాలు ఘర్షణలకు కారణమవుతున్నాయి. వాయవ్య, మధ్య నైజీరియాలో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. వేల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.