రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఇయ్యాల్టికి 23 రోజులు అయితుంది. ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి.. నేటి వరకు తాను తీసుకునే అన్నినిర్ణయాల్లో తనదైన ముద్ర అన్ని అంశాల్లో వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానికంతో పాటు.. ఇరుగుపొరుగు రాష్ట్రాల నేతలు.. ప్రజలు కూడా ఈయనవైపు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. సామాన్యుడికి దూరంగా ఉన్న ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల మనసులకు దగ్గరయ్యడు. తొమ్మిదన్నర ఏండ్ల పాలననలో గేటు దగ్గరకు రానియ్యని పాలకులను మరిపించేలా చేస్తున్నడు. సీఎంగా తనకు క్యాంపు ఆఫీస్ ఎంపికలోనూ అధికారులకే వదిలేశారు. తాను ఎక్కడున్నా ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సీఎం అయితే మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఉండవా... తాను సైతం అందరిలాగే ట్రాఫిక్ లో ప్రజలతో పాటు సీఎం వెళ్తున్నారు. అప్పుడప్పుడు ఇవన్నీ చూస్తుంటే.. భరత్ అనే నేను సినిమాలో మహేశ్ బాబు గుర్తుకొస్తాడు కూడా.
రాష్ట్రం తెచ్చామని చెప్పుకునే లీడర్లు చేయని పనిని అలవోకగా చేసేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్ష లీడర్లకు టైమ్ ఇస్తున్నడు. వాళ్లతో కూర్చుని మాట్లాడుతుండు.. అందరి సలహాలు తీసుకుంటున్నడు. గతంలో ఏనాడు లేనివిధంగా ప్రజావాణీ నిర్వహిస్తూ.. నేరుగా ముఖ్యమంత్రిగా తానే అర్జీలు తీసుకుంటున్నడు. రాష్ట్ర ప్రజలకు ఇంతకు మించి ఇంకేమి కోరుకుంటరు. 9 ఏండ్లలో ఏ ఒక్క నాడు నళిని గురించి చర్చకు వచ్చిన రోజే లేదు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తెల్లారో మరునాడో ఆమె అంశం తెరమీదకు వచ్చింది. నళినికి అదే ఉద్యోగం.. లేదంటే అదే స్థాయిలో ఉద్యోగాన్ని ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను ఉన్నతాధికారులతో పరిశీలించారు. ఉద్యమకారులకు గుర్తింపునివ్వాలనే తపన కనిపించింది. ఉద్యమకారులపై గతపాలకులు కేసులు మాఫీ చేసుడు పక్కకు పెడితే.. నానా హింసలకు గురయ్యారు. ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత ఒక్క మాటతో చేసేసి వారి కష్టానికి త్యాగానికి గుర్తింపు ఇచ్చే ప్రయత్నం చేశారు.
గతంలో పెద్ద సారు(కేసీఆర్) ఉన్నపుడు గవర్నర్ తమిళ సై తోని ఎప్పుడూ కయ్యమే ఉంటుండే. పిల్లి.. ఎలుక లొల్లి లెక్క. ఇయ్యాళ(jan 1st) రాజ్ భవన్ లో జరిగిన ఓపెన్ హౌజ్ కార్యక్రమానికి సీఎం పోయిండు. పూల బొకెలు ఇచ్చి శాలువాలు కప్పి ఆమెను ఖుషి చేసిండు. ఆమె గూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి సంతోషం చేసింది. ముఖ్యమంత్రిగా ప్రజలకు దగ్గరగా ఉండాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఇయ్యాల కూడా శుభాకాంక్షలు చెప్పెటోళ్లకు టైమ్ ఇచ్చిండు. తన క్యాంపు ఆఫీస్ లో పనిచేసే సిబ్బంది కూడా వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి.. సిబ్బంది కూడా ఇచ్చే విలువ చూస్తుంటే ముచ్చటేస్తుంది.
ఏదో ఊళ్ల వార్డు నంబర్ పదవి వచ్చినా ఆగే కాలం కాదు ఇది. అలాంటిది రాష్ట్రానికి సీఎం గా ఉంటూ చిన్నా.. పెద్ద లేకుండా అందరికి స్థానం ఇస్తు సీఎం గా రేవంత్ రెడ్డి చాలా పరిణతితో ఆలోచిస్తున్నాడు. గత పాలకులు చేసిన లోపాలు చేయడం లేదు. ప్రజల్లో లేని వాడు నాయకుడే కాదన్నట్లుగా నిత్యం ప్రజల కోసం.. పరితపిస్తున్న సీఎం తన ఓన్ బ్రాండ్ ఇమేజ్ ను రాష్ట్రం మీద వేస్తున్నాడటంలో ఏ మాత్రం అతిశయోక్తి కాదు. తెలంగాణోళ్లకు బాధ వచ్చినా.. సుఖం వచ్చినా ఎక్కువ సేపు ఆపుకోలేరు.. బడబడ చెప్పుకుంటే పోతదనే మనస్తత్వం ఉన్నవాళ్లు. అందుకే బాధలు విని.. నీ బాధ నేను తీరుస్తాలే అంటూ ఓ చిరునవ్వు నవ్వి.. భుజం మీద చేయి వేస్తే చాలు.. తన కష్టాన్ని ఆడనే మరిచిపోతరు. ఇట్లనే జనంల ఉంటూ.. జనం కోసం పని చేసే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నరు తెలంగాణ జనం.
యాకయ్య ఓడపల్లి
గోల్కొండ న్యూస్