ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు, కళారత్న అవార్డు గ్రహీత, చిందుల హంస గడ్డం సమ్మయ్యను పద్మ శ్రీ అవార్డు వరించింది. ప్రాచీన జానపద కళల్లో ఒకటైన చిందు యక్షగానానికి ఓ కొత్త రూపం తెచ్చాడు సమ్మయ్య. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన సమ్మయ్య చిన్నతనం నుంచి కళనే నమ్మకుంటూ జీవనం సాగించాడు. పుట్టిన ఊరికే కాదు ఈ ప్రాంతానికే వన్నె తెచ్చాడు. కళనే ఆరాధిస్తూ.. కళను బతికిస్తూ.. తాను బతుకుబండి నడిపించాడు.
చిందు యక్షగాన కళాకారునిగా గడ్డం సమ్మయ్య బృందం దేశ విదేశాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. నిన్నా మొన్న జరిగిన అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవంలోనూ మన సమ్మయ్య బృందం ప్రదర్శనలిచ్చి.. అందరిని మెప్పించారు. గ్రామాల్లో ఎక్కువగా వీరి ఆటలకు ప్రభావితం అవుతారు జనాలు. అందుకే గ్రామాల్లోకి వివిధ ప్రభుత్వాల పథకాలు సులువుగా వెళ్లాలంటే వీరి ఆటలు.. పాటలే కీలకంగా మారాయి. మద్యపాన నిషేధం.. కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత పెంపు వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అటు ప్రజల.. ఇటు పాలకుల మన్ననలను పొందారు. కళ కళ కోసం కాదు.. అది ప్రజల కోసం అన్నట్లుగా కళను ఎల్లలుదాటేలా చేసి.. జాతీయ స్థాయిలో పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్న సమ్మయ్యకు జనగామ జిల్లా వాసులు సంబురపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు వంటి ప్రముఖులు తమ ఎక్స్ ఖాతాల్లో శుభాకాంక్షలు అందించారు. అయితే ఇంత గొప్ప ఆనంద సమయంలో సమ్మయ్య భార్య కొంత అనారోగ్యంతో హాస్పిటల్ చేరడం.. సమ్మయ్యతో పాటు వారి కొడుకులు హస్పిటల్ లోనే ఉండటం కాసింత బాధకరమైన విషయమే.