రాహుల్ గాంధీ రెండో దశ పాదయాత్రకు అడ్డంకులు ఎదురవుతున్నాయనీ.. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్లోని ప్యాలెస్ గ్రౌండ్లో యాత్ర నిర్వహించేందుకు మణిపూర్ ప్రభుత్వం నిరాకరించిందనే సమాచారం తమకు అందిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ అన్నారు. కొద్ది రోజుల కిందటే మణిపూర్ పిసిసి చీఫ్ రేఖా చంద్రా గ్రౌండ్ అనుమతి కోసం అక్కడి సిఎస్ కు దరఖాస్తు చేశారు. ఐదు రోజుల్లో వివరాలూ వెల్లడిస్తామని చెప్పారు. కానీ బుధవారం మాత్రం అనుమతి నిరాకరిస్తున్నట్లు చెప్పారని ఆయన వెల్లడించారు.
తూర్పు నుండి పశ్చిమానికి యాత్రను ప్రారంభించినప్పుడు మణిపూర్ ను తాము ఎలా వదిలివేస్తామన్నారు. మణిపూర్ లో అల్లలు జరిగిన సమయంలోనే రాహుల్ గాంధీ అక్కడ పర్యటించి ప్రశాంతి నెలకొల్పాలని ప్రయత్నాలు చేశారన్నారు. ఇప్పుడు తామేమి రాజకీయాలు చేయడం కోసం వెళ్లడం లేదని విషయాన్ని గుర్తు చేశారు. తమ అభ్యర్థనను నిరాకరించి దేశానికి ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారని ఆయన ప్రశ్నించారు. మణిపూర్ నుంచి యాత్రను ప్రారంభిస్తామని.. ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నామని విషయాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. మణిపూర్ నుంచి ముంబయి వరకు రాహుల్ గాంధీ యాత్ర ఈ నెల 14 నుంచి ప్రారంభించాల్సి ఉంది.