అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది ఆయోధ్య నగరం. ఆ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రదర్శనలు ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కళారత్న, హంస అవార్డు గ్రహిత గడ్డం సమ్మయ్య బృందానికి అహ్వానం అందింది. మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్, సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ నాగపూర్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలను యూపీలోని ఆయోధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శనలు ఈ నెల 14 నుంచి 19 వరకు ఉంటాయి. మొత్తం 15 మంది కళాకారులతో కూడిన బృందానికి అన్ని రకాల వసతులు అక్కడే ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య బృందం దేశ విదేశాల్లో కళా ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో ఏండ్ల నుంచి చిందు యక్షగాన కళారూపాన్ని నమ్ముుకుని కొన్ని కుటుంబాలు జీవనాన్ని సాగిస్తున్నాయి. నాడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైమ్ నుంచి గ్రామాల్లో మద్యపాన నిషేధంపై ఎన్నో కళారూపాలు ప్రదర్శించారు. ఆ తరవాత రాష్ట్రం అంతటా తిరిగి కుటుంబ నియంత్రణ, అక్షరాస్యత పెంపు వంటి ప్రభుత్వ కార్యక్రమాలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి అటు ప్రజల.. ఇటు పాలకుల మన్ననలను పొందారు. గడిచిన తెలంగాణ ప్రభుత్వంలోని పలు పథకాల మీద గ్రామాల్లో అవగాహన కోసం ప్రదర్శనిలిచ్చారు. మారుతున్న కాలానుగుణంగా వస్తున్న కార్యక్రమాలకు కొత్తగా ప్రజలను ఆకట్టుకునేలా పాటలు, స్క్రిప్టు రాసుకుని జనరంజకంగా తమ కళారూపాలను కొనసాగిస్తున్నారు. ఎన్నో వేదికలపై ప్రదర్శనలిచ్చినా.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వనం అందడం.. అక్కడ ప్రదర్శనలు ఇవ్వడం పూర్వజన్మలో చేసిన పుణ్యమేనని గడ్డం సమ్మయ్య తెలిపారు.
గోల్కొండ న్యూస్
జనగామ