- ఎన్నికల ముందే బీఆర్ ఎస్ పార్టీలో పొరపొచ్చాలు
- సభల్లో నిలదీస్తున్న ఉద్యమకారులు
- ఈ సారీ బోయినపల్లి గెలుపు కష్టమేనంటున్న విశ్లేషకులు
కరీంనగర్ నుంచి గోల్కొండ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు ఎలా ఉన్నా.. కరీంనగర్ లో మాత్రం కొంచెం వేరుగా ఉంటాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన బోయినపల్లి వినోద్ కుమార్ ఓటమి పాలయ్యారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అన్ని బీఆర్ ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా ఓటమి తప్పలేదు. ఇప్పుడు చేతిలో అధికారం లేదు. నియోజకవర్గ కేంద్రం కరీంనగర్ మినహా ఎక్కడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కనిపించడం లేదు. నిన్నటినిన్న కార్యకర్తల సమావేశంలో ఉద్యమకారుడు పార్టీ పరిస్థితులపై ఏకిపారేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్వయంప్రకటిత మేధావిగా చెప్పుకుంటున్న వినోద్ కుమార్ గెలుపు మిధ్యేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వెలమలకు చోటివ్వొద్దు..:
కరీంనగర్ అంటేనే ఒకప్పుడు వెలమ రాజకీయ నాయకులకు అడ్డగా ఉండేది. అలాంటి గత కొన్ని టర్మ్ ల నుంచి బీసీలకు అడ్డగా మారింది. ఎమ్మెల్యేగా గంగుల కమాలకర్, అటు ఎంపీగా బండి సంజయ్ కుమార్ ఇద్దరు బీసీలు.. అందునా మున్నురుకాపులే ఏలుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ వెలమలకు చోటివ్వొద్దనే భావనతోనే చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇవ్వలేదు. ఎక్కడ వెలమలకు చోటిస్తే తమ నియెజకవర్గాల్లో వేలుపెట్టి కంపులేపుతారనే భయంతోనే వినోద్ కుమార్ ఓటమి కట్టబెట్టారు. ఇక్కడ పార్టీలు వేరుగానే ఉన్నా.. కులాల దగ్గరకు వచ్చేసరికి అంతా ఒక్కటవుతారు. కరీంనగర్ లో అధికంగా ఉన్న మున్నురుకాపు నేతలు ఎట్టి పరిస్థితుల్లో వెలమలకు అధికారం ఇచ్చేందుకు సుముఖంగా లేరు. కరీంనగర్ లో అధికంగా ఉన్న మున్నురుకాపు సామాజికవర్గం నుంచి అటు ఎమ్మెల్యే.. ఇటు ఎంపీ ఉండటంతో వారంతా సంతోషంగా ఉన్నారు. గతంలోనూ గంగుల , సంజయ్ నడుమ సామాజికవర్గానికి చెందిన మేధావులు.. కీలకంగా ఉన్న వ్యక్తులు సయోధ్య కుదిర్చారనేది బహిరంగ రహస్యం. ఈసారి జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా బండి సంజయ్ పూర్తి స్థాయిలో పని చేయకపోవడం వల్లనే ఎమ్మెల్యేగా గంగుల కమాలకర్ గెలిచారనేది అందరు ఒప్పుకునే వాస్తవం. గతంలో మాదిరిగానే ఈ సారి కూడా బండి మళ్లీ ఎంపీగా గెలిచేందుకు సామాజికవర్గం మద్దతు కోరుతున్నట్లు తెలుస్తుంది.
మా చేతిలో ఏం ఉంది..? :
గతంలోనైనా అధికారం ఉంది.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారనే దీమా బోయినిపల్లి వినోద్ కుమార్ కు ఉండేది. కానీ ఇప్పుడు కాస్త పోయింది. ఉన్న ఒక్క గంగుల కమాలకర్, పాడి కౌశిక్ రెడ్డిలు తమ పదవిని కాపాడుకునే పనిలోనే ఉన్నారు. ఇప్పటికే గంగులకు లెఫ్ట్ అండ్ రైట్ గా ఉంటున్న నేతలను భూకబ్జాల కేసుల్లో జైల్లో పెట్టారు. వాళ్లు అప్రూవర్లుగా మారితే ఎవరి జాతకాలు బయటపడతాయెననే భయంతోనే నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో వినోద్ కుమార్ గెలుపు కష్టమేననే సంకేతాలు వెలువడుతున్నాయి. అధికారం ఉన్నపుడే వినోద్ కుమార్ కు సపోర్ట్ గా లేని నాయకులు.. ఈయన గెలుపు కోసం ఈ ఎన్నికల్లో పని చేస్తారంటే అది అతిశయోక్తేనని చెప్పాలి. అధికారం లేదు.. మొన్న ఎన్నికల్లో గెలవడానికే అక్కడ ఇక్కడ తెచ్చిన పైసలు అప్పుల్లో ఉన్న నేతలు వినోద్ కుమార్ అండగా ఉండేందుకు సుముఖంగా లేరనేది వాస్తవం.
కార్యకర్తల్లో తీవ్ర అసంత్రుప్తి:
గతంలో బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా గెలిచినా కరీంనగర్ ప్రజలకు ఏనాడు కనిపించలేదు. చెప్పుకోదగిన పనులు కూడా చేయలేదు. ఎప్పుడు కనిపించని నాయకడు కాబట్టే ఓటర్లు కూడా దూరం పెట్టారు. సామాన్యుల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదు. ఏనాడు ఆయన ఇంటి ముందు పది మంది సామాన్యులు వెళ్లిన దాఖలాలు లేవు. ఓడిన తరవాత ప్రజలు.. ఓటర్ల విలువ తెలుసుకున్న బోయినపల్లి చావులకు, బతుకులకు.. పురుడ్లు.. పుణ్యాలకు.. బర్త్ డేలు.. చీరకట్టించే ఫంక్షన్లకు కూడా వెళ్తున్నారు. వినోద్ కుమార్ వెళ్తున్నా.. జనాలు ఆయన వెంటలేరనేది వాస్తవం. నాయకుల సహకారం లేదు. దీనికి తోడు పార్టీ రాష్ట్రంలో ఓడిపోవడం .. కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లనే ఓడిపోయామనేది అందరిలో ఉంది. సోమవారం రేకుర్తిలో జరిగిన మీటింగ్ లో బహిరంగంగా ఉద్యమకారుడు కాసారపు శ్యామ్ విమర్శించాడు. చెంచాగాళ్లకు.. జోకుడుగాళ్లకు పార్టీలో విలువ ఇచ్చారు కానీ కష్టపడి ఉద్యమంలో పాల్గొన్న వారికి ఎలాంటి గుర్తింపు లేదని తీవ్ర స్థాయిలో మాట్లాడాడు. కింది స్థాయిలో కార్యకర్తలను ఎవరు పట్టించుకోకపోవడంతోనే పార్టీకి నష్టం వాటిల్లింది. అటు పార్టీ క్లిష్టపరిస్థితి.. నాయకుల సహకారం లేకపోవడం.. సామాజికవర్గాల లెక్కలు వెరసి స్వయంప్రకటిత మేధావిగా చెప్పుకునే వినోద్ కుమార్ కు ఈ ఎన్నికల్లోనూ గట్టెక్కడం కంటే ఓటమే మూటగట్టుకోనుంది.