కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతికి బీఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడిందని చెప్పిన కాంగ్రెస్ నేతలు… నేడు అందుకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంపైనే జ్యుడీషియల్ విచారణ కోరడం సిగ్గు చేటన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని కాపాడేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమన్నారు. అయోధ్యలో రామ మందిర పున: ప్రతిష్ట కార్యక్రమాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం విడ్డూరమన్నారు. ఇది బీజేపీ కార్యక్రమం కానేకాదని, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి భారతీయుడు పాల్గొనే మహత్తరమైన కార్యక్రమమన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై కాంగ్రెస్ విధానామేంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం గీతాభవన్ చౌరస్తా నుండి ఎస్సారార్ కళాశాల వరకు నిర్వహించిన 3 కే రన్ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఎస్సారార్ కళాశాల విద్యార్థుల వద్ద యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఏబీవీపీ పూర్వ విద్యార్ధిగా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే 3కే రన్ పాల్గొనడం ఆనందంగా ఉంది. స్వామి వివేకానంద చరిత్ర, ఆశయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు బహిష్కరించడం, కాళేశ్వరంపై జ్యూడిషియల్ విచారణపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు…
అయోధ్య రామయ్య అందరికీ దేవుడని.... ప్రతి భారతీయుడు రాముడి విగ్రహ పున:ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. రామ మందిర నిర్మాణం బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కానేకాదని.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా.. వ్యతిరేకమా.. స్పష్టం చేయాలన్నారు. పవిత్రమైన కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ కు తగదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు బీజేపీ సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని. అయినా అవకతవకలపై విచారణ సీబీఐతో ఎందుకు జరిపించడం లేదన్నారు. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యూడిషియల్ విచారణ అడుగుతున్నారని.. కాంగ్రెస్ ద్వంద్వ విధానాాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజలకు మేలు జరిగే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తిగా సహకరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.