ఏపీలో గ్రామ వలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. వలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు సోమవారం సాయంత్రం వరకూ తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం సమ్మె సైరన్ మోగించేందుకు వలంటీర్లు డిసైడయ్యారు.
2019 అక్టోబర్‌లో జగన్ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వలంటీరుకు రూ.5 వేలు గౌరవవేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే, గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.