- కరీంనగర్ లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం
- కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ ఓపెన్
నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి, అక్రమంగా భూకబ్జాకు పాల్పడిన నిందితుడు మాజీ ఎంపీటీసీ, (తీగలగుట్టపల్లి) కొమ్ము భూమయ్యను పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్ కు తరలించారు. కొమ్ము భూమయ్య నకిలీ ధ్రువపత్రాలు తయారుచేయడమే గాక.. నకిలీ స్టాంపులు, సర్పంచ్ , పంచాయతీ సెక్రటరీ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కరీంనగర్ పోలీసులు భూ కబ్జారాయుళ్లపై చేపట్టిన ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. ఇప్పటికే సిటీలోని ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సీతారాంపుర్ కార్పొరేటర్ జంగిలి సాగర్ పై రౌడీ షీట్ తెరిచారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ శివారులో ఉన్న తీగలగుట్టపల్లిలో మరో భూమాఫియాకు అడ్డగా మారిన కొమ్ము భూమయ్య అరెస్టు సంచలనంగా మారింది. కొమ్ము భూమయ్య చేసిన కబ్జాల వివరాలను పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన దీటీ మధు 2013 లో ఆరెపల్లి గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 311, ఓపెన్ ప్లాట్ నంబర్.5 లో గల 91 గజాల ఇంటి స్థలాన్ని కరీంనగర్ కు చెందిన నల్లవెల్లి రాజు నుంచి ఖరీదు చేశాడు. ఈ స్థలాన్ని ఇంటి నిర్మాణం కోసం తన భార్య ఎండల సరిత పేరున మార్చాడు. మున్సిపాలిటీ ద్వారా ఇంటి నంబర్ 4-63/A/A/2/A/1 తీసుకుని నిర్మించుకున్నాడు. ఓ రోజు గుంజ లక్ష్మణ్ అనే వ్యక్తి అక్రమంగా, తన ఇంటిలో చొరబడి తనకున్న ఆ ఇంటిని కాజేయాలనే నేరపూరిత కుట్రతో, ఇంటి గేటుపై ఉన్నటువంటి ఇంటి నెంబర్ ప్లేట్ ని తొలగించి మరొక ఇంటి నెంబర్ 1-42/6/E/4/A/1 గల ప్లేటును తగిలించాడు. ఈ స్థలం తనదేనని, తీగులగుట్టపల్లి కి చెందిన మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య వద్ద నుండి కొనుగోలు చేశానని వాగ్వివాదానికి దిగాడు. ఇంటిని వదిలి వెళ్లకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై దీటి మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్
కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య, గుంజ లక్ష్మణ్ లు ఇద్దరు మధుకు చెందిన ఇంటిని కాజేయాలని సర్పంచ్ , పంచాయతీ సెక్రెటరీ సంతకాలను ఫోర్జరీ చేసి అదే ఇంటి స్థలంపై నకిలీ ధ్రువపత్రాలు సృష్టించారని విచారణలో తేలింది. అక్రమంగా ఇంట్లో చొరబడి, దౌర్జన్యానికి పాల్పడి ఇంటి నెంబర్ తొలగించినందుకు, ఇంటి యజమానిని చంపుతానని బెదిరించినందుకుగాను కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు Cr. No. 69/2024, U/Sec 420, 465,467,471,447,427,506,120-b r/w 34 IPC పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచారు. ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముద్దాయిలకు 15 రోజుల రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.