కరీంనగర్ లో భూ కబ్జాదారులపై పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే కబ్జాలకు పాల్పడిన ఇద్దరు కార్పొరేటర్లు.. సహా పలువురిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమాలకర్ కు అనుచరుడిగా పేరున్న తోట శ్రీపతి రావు అరెస్టు కావడం కలకలం రేపుతుంది. సిటీలోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమండ్ల రవీందర్ అనే వ్యక్తి 2014 మే నెలలో తీగలగుట్టపల్లి రోడ్ నం. 16 కార్తికేయ నగర్ లో 233/E నందు 144 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలానికి బేస్మెంట్ నిర్మించుకున్నాడు.. నవంబర్ 2023 లో బోర్ కూడా వేయించుకున్నాడు. మున్సిపల్ ఆఫీస్ నుండి అనుమతి పొంది నిర్మాణ పనులు స్టార్ట్ చేశాడు. గత నెల 10వ తేదీన రాత్రి 10:30 గంటలకు ఏడు నుంచి 12 మంది గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ఇంటి నిర్మాణ స్థలంలోకి చొరబడి అప్పటికే నిర్మించిన 8 పిల్లర్లతో పాటు.. నీటి సంపు, నిర్మాణానికి ఉపయోగించే పరికరాలను నాశనం చేసి దాదాపు రూ. 4 లక్షల నష్టం చేశారు. ఈ వీడియోలు సైట్ దగ్గర సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో కరీంనగర్లోని చైతన్యపురి కాలనీకి చెందిన తోట శ్రీపతి రావు అనే వ్యక్తి, పొన్నాల కనకయ్య, పవన్ , సిరిపురం వెంకటరాజు మరి కొంతమందిని మనుషులను మాట్లాడి ఇంటి నిర్మాణం కూల్చవలసిందిగా ఆదేశించినట్లు తేలింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకుని పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసి పట్టుకునేందుకు స్పెషల్ టీం ను సైతం ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు . ఎట్టకేలకు నిందితుడు హైదరాబాద్ లోని అంబర్ పేట్ తన సోదరుని నివాసంలో ఉన్నట్లు గుర్తించిన స్పెషల్ టీం పోలీసులు ఎంతో చాకచక్యంగా సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తోట శ్రీపతిరావు అనే నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు.
కరీంనగర్ లో శివారు గ్రామాల్లో పెచ్చు మీరుతున్న భూకబ్జాలతో సామాన్యులు ఎంతో నష్ట పోతున్నారు. బీఆర్ ఎస్ నేతలు అధికారం ఉందనే కారణంతో ఎంతో మంది అమాయకులను ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పటికే ఓ కార్పొరేటర్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. కరీంనగర్ పోలీసులు తీసుకుంటున్న చర్యలతో సామాన్యులు చాలా సంతోషంగా ఉన్నారు. కబ్జాదారుల గుండెల్లో మాత్రం దడపుడుతోంది.. రేపు ఎవరు అరెస్టు కాబోతున్నారనే టెన్షన్ అయితే వాళ్లలో మొదలైంది.