మంత్రులంటే భారీ కాన్వాయ్... కుయ్ కుయ్ మంటూ పెట్రోలింగ్ వెహికిల్స్.. గన్ మెన్ ల హడావుడి.. లీడర్ల ఆర్భాటం.. ఇవన్నీ ఉంటాయి. కానీ ఆయన దగ్గర ఇవేమి కనిపించవ్.. నూతన ప్రభుత్వంలో బీసీ సంక్షేమ , రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎంపికై మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా ఎక్కడా హంగు ఆర్బాటాలు చేయడం లేదు. ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా.. ఓ సామాన్య పౌరునిలాగే వ్యవహారిస్తున్నారు. శుక్రవారం
భీమదేవరపల్లి మండలం ముల్క నూరు లో బస్టాండ్ లోని ఓ టిఫిన్ సెంటర్ లో కార్యకర్తలు, నాయకుల, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వొడీతెల ప్రణవ్ లతో కలిసి టిఫిన్ చేశాడు. ఈ పదవులు.. అధికారం ఇచ్చింది ప్రజలే.. వాళ్లలో ఒకడిగా ఉంటా అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.
సాధారణ గౌడ సామాజికవర్గ కుటుంబం నుంచి వచ్చిన పొన్నం మొదటి నుంచి ఇదే విధంగా ప్రజలతో మమైకమై ఉంటారు. కరీంనగర్ లో ఆయన రాజకీయ ప్రస్థానం స్టూడెంట్ లీడర్ గా ప్రారంభమైంది. ఆ తరవాత వైఎస్సాఆర్ ప్రభుత్వంలో మార్క్ ఫెడ్ ఛైర్మన్ గా.. ఆ తరవాత కాంగ్రెస్ పార్టీ నుంచే కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కరీంనగర్ లో సామాన్యులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో రైలు సేవలు.. పాస్ పోర్టు కేంద్రం, శాతవాహన విశ్వవిద్యాలయం, లోకల్ బస్సులు.. ఇలా ఎన్నో సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం టైమ్ లో పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు కోసం లొల్లి పెట్టి ... పార్లమెంటును గడగడలాడించిన చరిత్ర పొన్నం ప్రభాకర్ కు ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నేతగా హుస్నాబాద్ నుంచి పోటీ చేసి సునాయసంగా గెలిచాడు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ సామాన్యుడిలా ముందుకు కదులుతున్నాడు.
గోల్కొండ న్యూస్
కరీంనగర్