- ఊచలు లెక్కపెడుతున్న కరీంనగర్ కార్పొరేటర్లు
- పోలీసుల తీరుపై అభినందనలు వెల్లువ
కరీంనగర్ లో కార్పొరేటర్ల పై పోలీసుల వేట మొదలైంది. నిన్న బీఆర్ఎస్ కార్పోరేటర్ తోటరాములను అరెస్టు చేయగా.. ఈ రోజు మరో కార్పోరేటర్ జంగిల్ సాగర్ పై వేటు పడింది. కరీంనగర్లో కబ్జాలకు అడ్డాగా మారిన లీడర్లను ఒక్కొక్కరిని పోలీసులు కటకటాలకు పంపుతున్నారు. అమాయకులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్లు ఇల్లు కట్టుకోవాలని గుంట జాగ కొనుక్కోవాలన్న భయంతో వణికి పోయే రోజులివి. వాళ్ల కనుసన్నల్లో.. అనుకున్నంత డబ్బు ముట్ట చెపితేనే వదిలిపెడతారు. లేదంటే రాత్రికి రాత్రే కట్టిన ఇండ్లను కూల్చివేస్తారు. కొనుక్కున్న ప్లాట్లలో రాత్రికి రాత్రే పునాదులు లేపి గోడలు కూడా కడతారు.
ఇంతటి దౌర్జన్యాలు అక్రమాలకు పాల్పడ్డ కబ్జాకోరుల ఆగడాలు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు సాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా చేసిన పని భూ కబ్జాకోరులపై వేట. ఇప్పటికే మంత్రి పొన్న ప్రభాకర్ ఆర్టీఏ కార్యాలయం దగ్గరి పార్కు పేరు చొక్కారావు పార్కుగా మార్చారు. కేసీఆర్ పేరిట ఉన్న గెస్ట్ హౌజ్ పేరును సైతం తొలగించారు. ఇలా నాడు బీఆర్ ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇష్టారీతిగా చేసిన పనులను.. ప్రజలు ఇప్పుడు ఆమోదించడం లేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపుతుంది.
రేకుర్తి ప్రాంతంలో అనేక ప్రభుత్వ భూములను కబ్జా చేసి తన కుటుంబ సభ్యులు బంధువులు పేర్ల మీద రాయించుకుని అసలైన లబ్ధిదారులకు ఎన్నో ఇబ్బందులకు గురిచేసిన కార్పొరేటర్ జంగిలి సాగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. తోట రాములు, జంగిలి సాగర్ తో పాటు కరీంనగర్ శివారు గ్రామాల్లో భూ కబ్జాలకు పాల్పడి ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న బయటకు రాని నాయకులను సైతం విచారణ చేపట్టి జైళ్లకు తరలించాలని కరీంనగర్ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. కరీంనగర్ నగరంలో రాజకీయ అండదండలతో కబ్జాకోరులుగా మారి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అందరిని కటకటాలకు పంపించాలని ప్రజలు కోరుతున్నారు.