- కరీంనగర్ లో ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు సహా ముగ్గురి అరెస్టు
కరీంనగర్ లో భూదందాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఇన్ని రోజులు భూమిని ఆక్రమించడం.. వాటిని తప్పుడు పత్రాల పేరుతో మోసాలు చేసేవారు. కానీ ఇప్పుడు ఏకంగా భూమి లేకుండానే రిజిష్ట్రేషన్ చేస్తామని నమ్మించి కాగితాల్లోనే అంతా మాయచేసి ఓ వ్యక్తి నుంచి సుమారుగా కోటికి పైగా వసూలు చేసిన భూదందారాయుళ్ల బాగోతాన్ని కరీంనగర్ పోలీసులు గుట్టురట్టు చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ రేకుర్తికి చెందిన బీఆర్ ఎస్ కార్పొరేటర్ సుదగోని మాధవి భర్త క్రిష్ణ గౌడ్, మరో కార్పొరేటర్ కోల ప్రశాంత్ లతో పాటు ఏలేటి భరత్ రెడ్డి అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు మరో ముగ్గురు గజ్జెల స్వామి, బసవయ్య, అస్తపురం అంజయ్యలపైనా కేసు నమోదు చేశారు.
రేకుర్తి ఏరియాలో గుంటకు రూ. 30 లక్షల వరకు పలుకుతుంది. 2014లోనే ఈ కార్పొరేటర్ల భర్తలిద్దరు మోసానికి తెరలేపారు. రేకుర్తిలో 10 గుంటల భూమి ఉందని చెప్పి వేములవాడకు చెందిన రాజిరెడ్డికి నకిలీ పత్రాలు చూపించి క్రిష్ణ గౌడ్ నమ్మించాడు. అప్పట్లో ఉప సర్పంచిగా ఉండటంతో ఆయన్ని నమ్మారు. తరవాత 2020లో రేకుర్తి కార్పొరేషన్ లో కలిసింది. అప్పుడే క్రిష్ణ గౌడ్ భార్య కార్పొరేటర్ గా గెలిచింది. అప్పటి నుంచి ఆయన చెప్పిందే వేదం. వీరి డివిజన్ ను ఆనుకునే మరో డివిజన్ నుంచి కోల ప్రశాంత్ సతీమణి కార్పొరేటర్ గా గెలిచాడు. వీళ్లిద్దరు కలిసి సమస్య పరిష్కారం చేస్తామని నమ్మించి రూ. 1.37 కోట్లు వసూలు చేశారు. ఈ విషయంలో మరికొందరు కూడా ఉన్నారు. బాధితుడు ఆధారాలతో సహా సీపీని కలిసి ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారు.