- రైస్ షాపులపై కేసు నమోదు
- పట్టుకున్న లీగల్ మెట్రాలజీ అధికారులు
కరీంనగర్ సిటీలో బియ్యం షాపుల్లో కొన్ని లోకల్ బ్రాండ్స్ లను అనుసరిస్తూ... డూప్లికేట్ బ్రాండ్లను అదే పేరుతో ఉన్న రెడీ మేడ్ బియ్యం బ్యాగులలో తక్కువ ధర, తక్కువ క్వాలిటీ ఉన్న బియ్యాన్ని నింపి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు. బుధవారం కరీంనగర్ సిటీలోని గంజ్ ఏరియాలో ఉన్న బియ్యం దుకాణాలపై దాడులు చేసి 5 కేసులు నమోదు చేశారు.
అధికారులు చేసిన తనిఖీల్లో తక్కుత తూకం ఉన్న 26, 25 ల బ్యాగులను గుర్తించారు. ఏ బియ్యమైనా అడిగిన బ్రాండుల్లో ఇచ్చేందుకు సిద్ధంగా ఖాళీ బ్యాగ్ లను దుకాణాదారులు పెట్టుకున్నారు. వాటిపై ఎలాంటి అడ్రస్ లేకుండా.. ఎంఆర్ పీ ధరలు లేకుండా బ్యాగులు చాలా దొరికాయి.
కరీంనగర్ గంజ్ ప్రాంతంలో ఉన్న శ్రీ మాతా రైస్ డిపో, సాయి సరస్వతి కిరాణం, ఉప్పల కిష్ణమూర్తి కిరాణ షాపులపై ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు 230 రైస్ బ్యాగ్ లను సీజ్ చేశారు. వినియోగదారులు బియ్యం కొనేటపుడు షాపులో ఉన్న కాంటాపై తూకం వేసుకుని తీసుకోవాలన్నారు.
బియ్యం తయారీదారులు, పంపిణీదారులు ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉండి.. అధికంగా చలామణిలో ఉన్న బ్రాండ్లను అనుసరిస్తూ అదే రకమైన లోగోతో ఉన్న బ్యాగులను వాడి అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జోన్ ఏసీ కే విజయ సారథి హెచ్చరించారు.
ఈ దాడుల్లో లీగల్ మెట్రాలజీ కరీంనగర్ జోన్ ఏసీ కే విజయ సారథి, కరీంనగర్ జిల్లా ఇన్ స్పెక్టర్ భూ లక్ష్మీ, ఇన్ స్పెక్టర్ డి. రూపేష్ కుమార్, సిబ్బంది సుభాష్, కరుణాకర్ పాల్గొన్నారు.