వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమా విడుదలకు ముందు ప్రకంపనలు రేపుతోంది. చిత్రయూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, వీడియోల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను పోలిన క్యారెక్టర్లపై ఇరు పార్టీల శ్రేణులు భగ్గుమంటున్నాయి. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేలా తీశారంటూ సినిమా విడుదలపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాయిదా అనంతరం ఈ నెల 29న విడుదలకు లైన్ క్లియర్ అవడంతో టీడీపీ కార్యకర్తలు మరింత భగ్గుమంటున్నారు. వ్యూహం విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ఎదుట టీడీపీ కార్యకర్తలు సోమవారం ఆందోళన చేపట్టారని తెలుస్తోంది.