ఆంధ్ర పాలిటిక్స్ చాలా రసవత్తరంగా మారుతున్నాయి. గంటగంటకు మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వస్తుండటంతో పార్టీల నుంచి జంపింగ్ లు ఎక్కువ అవుతున్నారు. వైసీపీ నుంచి పార్థసారథి బయటకు వచ్చేందుకు పూర్తిగా రెడీ అయ్యారు. రేపో మాపో వేరే పార్టీలో చేరనున్నారు. ఇంకా చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు.. ఎంపీల అభ్యర్థులు కూడా ఆ పార్టీని వీడేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం వస్తుంది. కేశినేని టీడీపీ నుంచి బయటకు వచ్చాడు. మూడు రోజుల కిందట ఎంతో అభిమానంతో జగన్ తో కండూవా కప్పించుకుని వైసీపీలో చేరిన మాజీ యువ క్రికెటర్ అంబటి రాయుడు ఆ పార్టీకి రాజీనామా చేసి .. బుధవారం జనసేనాని పవన్ భేటి అయ్యాడు. పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానమని.. జగన్ పదేపదే పవన్ ను టార్గెట్ చేసి తిట్టడం.. దూషించడం తనకు నచ్చలేదని రాయుడు చెప్పుకొచ్చాడు. మర్యాదపూర్వకంగా కలిసిన రాయుడికి వినాయకుడి వెండి ప్రతిమను గిఫ్ట్ గా ఇచ్చాడు పవన్. దాదాపుగా పార్టీలో చేరిక కన్ఫమ్ అయినట్లేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
బాబుతో కలిసి పవన్ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలవడంతో వైసీపీ నేతలు వివిధ రకాలుగా విమర్శించగా.. జనసేన నేతలు అంతే స్థాయిలో ధీటుగా సమాధానాలు ఇచ్చారు. జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం.. ఇటు ఒక్కొక్కరుగా వైసీపీ వీడుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న జగన్ పరిస్థితి ఆందోళనకరంగా మారిందనే చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూస్తున్నారు. ఇప్పటికే క్యాంపు ఆఫీస్ కు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడి బుజ్జగింపులు చేస్తున్నా.. ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరనేది తెలుస్తుంది.