- భూకబ్జాలు.. పైరవీలకు ఆయన మాటే లక్ష్మణరేఖ
- మాజీ మంత్రి అనుచరులు ఒక్కొక్కరుగా జైలుకు
ఎక్కడైనా మంచి ల్యాండ్ కనిపిస్తే చాలు ఆయన కళ్లు అక్కడ వాలిపోతాయి.. అనుచరులు రంగంలోకి దిగుతారు. నయానో భయానో ఆ భూమిని దక్కించుకుంటారు. కాదు కూడదని తిరగబడితే రాత్రికి రాత్రే 10 మంది దిగి.. కట్టుకున్న గూడును క్షణాల్లో కూల్చేస్తారు. నిలువనీడ లేకుండా చేసేస్తారు. జిల్లాలో ఏ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎక్కడ ఉండాలన్నా.. సీఐ, ఏఎస్ పీలు ఎక్కడికి ట్రాన్సఫర్ కావాలన్నా.. ఆయన కనుసైగ చేస్తే చాలు... ఆ క్షణంలో పని పూర్తవుతుంది. గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయన చెప్పిందే పోలీస్ లకు వేదమంటే ఆయన రేంజ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. మాజీ మంత్రి గంగుల కమాలకర్ కు అన్ని వ్యవహారాల్లో షాడోలా వ్యవహరించే నందెల్లి మహిపాల్ ను కరీంనగర్ పోలీసులు మంగళవారం ఉధయాన్నే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఆయన దగ్గరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
భూకబ్జాలు, పైరవీలు, ఫైనాన్షియల్ అఫెన్సెస్ వ్యవ హారాల్లో తలదూర్చి పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్లపై కరీంనగర్లో పోలీసుల వేట కొనసాగుతోంది. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు నందెల్లి మహిపాల్ ను అదుపులోకి తీసు కున్నట్లు సమాచారం. బాధితులు కొంతమంది కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని ఆశ్రయించడంతో వివిధ కోణాల్లో విచారించి మహిపాల్ అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసు అధికా రులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించడం లేదు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా ఓలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన నందెల్లి మహిపాల్ ను విచారిస్తున్నారు.