- బియ్యం రీసైక్లింగ్ పాల్పడే వారి పట్ల అత్యంత కఠిన వైఖరి
- కాళేశ్వరంపై విచారణ చేయిస్తం
- రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బుధవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ లతో కలిసి ప్రజాపాలన గ్రామ,వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మంత్రి అన్నారు.
డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. గ్రామంలో నిర్వహించే ప్రజాపాలన సభ ముగిసిన తరువాత కూడా ప్రజలు పంచాయతీ కార్యాలయంలో జనవరి 6 వరకు తమ దరఖాస్తు సమర్పించే అవకాశం ఉందని,ఈ మేరకు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు మార్గదర్శకాలు జారీ చేయాలని మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజా పాలనలో దరఖాస్తుల స్వీకరించే సమయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు జత చేయాలని, రేషన్ కార్డు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని ప్రస్తుతం సేకరించిన దరఖాస్తుల పరిశీలించి, నూతన రేషన్ కార్డుల జారీ పై త్వరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నీటిపారుదల శాఖ ప్రాజెక్ట్ ల పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటానని మంత్రి తెలిపారు.మంథనిలోని చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, హుస్నాబాద్ లోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ లను డిసెంబర్ 29న పరిశీలించడం జరుగుతుందని, అనంతరం వాటి పై విచారణ నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.
పేద ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యం పై 39 రూపాయలకు కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తున్నామని, రేషన్ బియ్యం నాణ్యత పెంచే విధంగా అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపడుతుందని, అదే సమయంలో కొంతమంది మిల్లర్లు, ఇతర దళారులు కలిసి రేషన్ బియ్యం రీసైకిలింగ్ కు పాల్పడుతున్నారని, వారి పట్ల ఇక పై నూతన ప్రభుత్వం అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తుందని, రేషన్ రీసైక్లింగ్ ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని మంత్రి హెచ్చరించారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజాప్రాలన గ్రామసభల సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల తో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి పరిశీలించాలని, జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రజా పాలన కార్యక్రమానికి వచ్చిన ఏ ఒక్క దరఖాస్తు తిరస్కరించ వద్దని మంత్రి అన్నారు.
రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల జీరో టికెట్స్ జారీ చేయడం జరిగిందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు వస్తే టోకెన్లు జారీ చేయాలని మంత్రి సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, చింతకుంట విజయరమణా రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి, పోలీసు ఉన్నతాధికారులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని తహసిల్దార్లు, ఎంపీడీవోలు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.