ఎన్నికల నేపథ్యంలో ఒక నెల .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది.. మొత్తంగా రెండు నెలల నుంచి జీతాల్లేక సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వాలకు కనిపించడం లేదా అంటూ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగులు 555 మంది విధులు నిర్వహిస్తున్నారని.. ఇందులో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ 80 మంది, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు10, కంప్యూటర్ ఆపరేటర్లు 10, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు 80,ఐఇఆర్పిలు 28, మెసెంజర్లు12,డీపీవో స్టాఫ్ 9 మంది, కేజీబీవీ టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగులు 317, బిఆర్ఎస్ లో టీచింగ్ నాన్ టీచింగ్ 9 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలన్నారు. రెండు నెలల నుంచి పెండింగ్లో ఉన్న వేతనాలను త్వరగా చెల్లించి, ఆర్థిక ఇబ్బందులను దూరం చేయాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తమ వాటాను జమ చేసిందని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జమ చేయకపోవడం వల్లనే రెండు నెలలుగా వేతనాలు ఆగిపోయాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేయించుకుంటున్నప్పటికీ వేతనాలు ఇవ్వడంతో తీవ్ర జాప్యం చేస్తున్నారన్నారు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి.. ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలోని ఒరిస్సా, హర్యాన, ఢిల్లీ, మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వాలు క్రమబద్ధీకరించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండు చేశారు.