వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ అన్నట్లుగా .. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో చెలరేగి పోయిన అధికారి.. రవాణా శాఖ అదనపు కమీషనర్ , కేసీఆర్ బంధువు పాపారావు. ఈయనకు అర్హతలు లేకున్నా అడ్డదారిలో ఉద్యోగం సంపాదించాడు. కేసీఆర్ తమకు దగ్గరి బంధువు అంటూ రవాణా శాఖలో మకుటంలేని మహారాజులాగా వ్యవహారించాడు. ఈయన మాటే శాసనం.. ఈ చూపే చట్టంలా పదేండ్లు రాజ్యం ఏలాడు.
అధికారం ఉంది కదా అని.. కరీంనగర్ లో ప్రభుత్వ నిధులతో నిర్మించిన పిల్లలకు ట్రాఫిక్ మీద అవగాహన కోసం పార్కు నిర్మించారు. కానీ నిబంధనలకు విరుద్దంగా పాపారావు తన తండ్రి కృష్ణమనేని వెంకట రామరావు పేరు పెట్టాడు. పార్కులో తండ్రి విగ్రహం కూడా పెట్టాడు. మూడేండ్ల కిందట అప్పటి కరీంనగర్ డీటీసీ పుప్పలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పార్కు ఓపెనింగ్ చేపట్టారు. కేవలం అధికారం ఉందనే కారణంతోనే ఆ టైమ్ లో ఎవరూ మాట్లాడకుండా అందరి నోర్లు మూయించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరవాత నెమ్మదిగా బీఆర్ఎస్ టైమ్ లో చేసిన అక్రమాలు.. అధికార బలంతో చేసిన పనులపై నజర్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే చిల్ట్రన్స్ పార్కు పేరు కృష్ణమనేని వెంకట రామరావు నుంచి స్థానిక నాయకుడు జువ్వాడి చోక్కారావు గా పేరు మారుస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మారిన పేరు వెంటనే అమల్లోకి వస్తుందని అందులో పేర్కొనడం విశేషం. పార్కు పేరు మార్చడం పట్ల కరీంనగర్ నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సదరు అధికారులు మాత్రం ఖంగుతినాల్సి వచ్చింది.